◆ రాహుల్ గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ రేవల్లీలో కాంగ్రెస్ ధర్నా
● కేంద్ర ప్రభుత్వం, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని, అక్రమ అరెస్టులను నిరసిస్తూ గురువారం రేవల్లీ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ, టిపిసిసి పిలుపు మేరకు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఆదేశాల ప్రకారం.. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుల్తాన్ అలీల ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ సమస్యలపై నిరంతరం పోరాడుతున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల స్వరాన్ని అణచివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కార్యదర్శి వాడలా పర్వతాలు, మండల ఉపాధ్యక్షుడు కే. బంగారు శ్రీనివాస్, SC సెల్ అధ్యక్షుడు మిద్దె స్వామి, సర్పంచులు అంజలమ్మ, దూపం రాజు, డిప్యూటీ సర్పంచ్ అశ్విని, ఏఎంసి డైరెక్టర్ తిరుపతయ్య, సీనియర్ నాయకులు బాలస్వామి, వెంకటస్వామి గౌడ్, బాల్ రెడ్డి, మాజీ MPTC కరుణాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

