◆ రేవల్లిలో షాద్‌నగర్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరణాన్ని కోరుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కె. శంకరయ్యపై చర్యలు తీసుకోవాలని రేవల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది. బీఆర్‌ఎస్ మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివరాం రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఎస్‌ఐ రజితకు ఈ ఫిర్యాదు సమర్పించారు.
ఈ నెల 8న ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే శంకరయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ చనిపోవాలని, అందుకే వెయ్యి డప్పులతో ర్యాలీ నిర్వహిస్తున్నామని బహిరంగంగా అనడం కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలు కేసీఆర్ ప్రాణ భద్రతకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతల ప్రేరణతోనే ఎమ్మెల్యే ఇలా మాట్లాడారని నాయకులు ఆరోపించారు.
ఎమ్మెల్యే శంకరయ్యపై భారతీయ నవన్యాయ సంహిత సెక్షన్లు 196, 351(3), 352, 353, 61 కింద కేసు నమోదు చేయాలని, అలాగే కేసీఆర్ నివాసానికి తగిన పోలీస్ భద్రత పెంచాలని పోలీసులను కోరారు.

