* గోశాలలో ఐదు కోడెల మృతిపై సమగ్ర విచారణ
* కొత్తగా వచ్చే కోడెలకు 15 రోజుల క్వారంటైన్ తప్పనిసరి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించే కోడెలు, ఆవుల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. పశువుల సంరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇటీవల గోశాలలో ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఘటనకు మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణమని తేలితే బాధ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కోడెలకు క్వారంటైన్.. వయసు ఆధారంగా గ్రేడింగ్
కొత్తగా గోశాలకు వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశించారు. అనంతరం వాటి వయసు ఆధారంగా గ్రేడింగ్ చేసి, చిన్న, పెద్ద కోడెలను వేర్వేరుగా సంరక్షించాలని సూచించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గోశాలలో పరిశుభ్రత, పశుగ్రాసం, తాగునీరు, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
40 ఎకరాల్లో ఆధునిక గోశాల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేములవాడలో ఆధునిక సౌకర్యాలతో నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం పొందినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు.త్వరలోనే నూతన గోశాల నిర్మాణ పనులు ప్రారంభించి, ఆధునిక సౌకర్యాలతో గోశాలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించే కోడెలు, ఆవులకు మెరుగైన సంరక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

