* పెద్దపల్లి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు
* ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లులో అవసరమైన హమాలీలను ముందుగానే ఏర్పాటు చేయాలి
* ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి.. ఓవర్‌లోడ్‌కు అనుమతించవద్దు
* ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్
పెద్దపల్లి : ఖరీఫ్ 2026 సీజన్లో ధాన్యం కొనుగోళ్లను ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ 2026 ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మిల్లులకు మ్యాపింగ్, రవాణా, హమాలీలు, గోదాముల లభ్యత, తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, నాణ్యత ధ్రువీకరణ, బోనస్, చెల్లింపులు, ఏఐ సాంకేతికత వినియోగం తదితర అంశాలపై అదనపు కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు మాట్లాడుతూ ధాన్యం రవాణాకు ఏర్పాటు చేసే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ తప్పనిసరిగా ఉండాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రతి వాహనం కదలికలను క్రమం తప్పకుండా ట్రాక్ చేయాలని, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రవాణా అవసరాల కోసం మాత్రమే ఆ వాహనాలను వినియోగించాలని ఆదేశించారు. వాహనాలను ఏర్పాటు చేసే కాంట్రాక్టర్లు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ధాన్యం రవాణా చేసే వాహనాల్లో అధిక లోడును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని, నిర్దేశిత సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే ధాన్యాన్ని రవాణా చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ సీజన్లో హమాలీల సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు ప్రతి రైస్ మిల్లుకు అవసరమైన సంఖ్యలో హమాలీలను ముందుగానే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం దిగుమతి, లోడింగ్, అన్లోడింగ్ తదితర ప్రక్రియలకు అవసరమైన హమాలీలు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరమైన తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే మాయిశ్చర్ మీటర్లు, ధాన్యం శుభ్రపరిచే ప్యాడీ క్లీనర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోని తూకం యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో మెట్రాలజీ శాఖ అధికారులు ముందుగానే తనిఖీ చేసి ధ్రువీకరించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు కొనుగోలు ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు.
ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తూకం, తేమ శాతం పరిశీలన, కొనుగోలు నమోదు, బోనస్, చెల్లింపులు తదితర అంశాలపై వారికి అవసరమైన శిక్షణను ముందుగానే అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు రకాల సన్న రకాల ధాన్యానికి బోనస్ అందనున్నందున, అర్హత కలిగిన ధాన్యానికి నిబంధనల ప్రకారం బోనస్ అందేలా నాణ్యతను ఏఈఓలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు ధ్రువీకరించాలని ఆదేశించారు. నాణ్యత ధ్రువీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ముందుగానే ప్రతిపాదించాలని సూచించారు. ప్రతిపాదించిన ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంబంధిత రైస్ మిల్లులకు కేటాయించి, కొనుగోలు కేంద్రాల వారీగా మిల్లులకు అవసరమైన మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ధాన్యం కేటాయింపులకు సంబంధించి మిల్లర్లు తప్పనిసరిగా బ్యాంకు గ్యారంటీలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసారి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఏఐ సాంకేతికతను వినియోగించనున్నామని, కొనుగోలు కేంద్రాల నుంచి అప్లోడ్ చేసే ఫొటోలు, వివరాలను సాంకేతికత ద్వారా పరిశీలించే అవకాశం ఉంటుందని తెలిపారు.
పాత ఫొటోలను అప్లోడ్ చేసి ప్రస్తుత పరిస్థితులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేసినా సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తాజా ఫొటోలు, వివరాలను మాత్రమే నమోదు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు వివరాలను సంబంధిత ఆన్లైన్ వ్యవస్థలో ఎప్పటికప్పుడు, ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు.
రైతులకు చెల్లింపులు ఎలాంటి పొరపాట్లు లేకుండా సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత సీజన్లో చెల్లింపులకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురైనందున, ఈ సీజన్లో అవి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఈ సీజన్ ధాన్యం నిల్వకు కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నుల గోదాం స్థలాన్ని ముందుగానే గుర్తించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న గోదాముల స్థలాన్ని కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు కేటాయించకూడదని స్పష్టం చేశారు.
ధాన్యం నిల్వకు అవసరమైన గోదాం సామర్థ్యాన్ని ముందుగానే గుర్తించి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్టోబర్ 1 నుంచి పనిచేయాల్సి ఉన్నందున కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మిల్లులకు మ్యాపింగ్, హమాలీల నియామకం, రవాణా వాహనాల ఏర్పాటు, జీపీఎస్ ట్రాకింగ్, గోదాముల గుర్తింపు, అవసరమైన పరికరాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ తదితర అన్ని ఏర్పాట్లను అక్టోబర్ 1కు ముందే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఖరీఫ్ 2026 ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను ముందుగానే పూర్తి చేసి, అక్టోబర్ 1నుంచి జిల్లాలోని అన్ని ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాల్లో సజావుగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా అధికారులు సమగ్ర కార్యాచరణతో పనిచేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు ఆదేశించారు. అక్టోబర్ 1 ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఒకేసారి ప్రారంభించనున్నారని తెలిపారు.
అదే రోజు నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నందున జిల్లాలో ప్రతిపాదించిన అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్టోబర్ 1 నుంచే పనిచేసేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలోజిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, రవాణా కాంట్రాక్టర్లు , సంబంధిత శాఖల అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

