# అంబేద్కర్ జంక్షన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు నిరసన ర్యాలీ
# డీసీసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు
హనుమకొండ, ఆగస్టు 14: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పట్ల బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరును వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కుల, మతాల పేరుతో రాజకీయాలు చేయడం బీజేపీకి తగదని ఆయన అన్నారు.
హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాం రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద ఖర్గేకు సంఘీభావంగా నిర్వహించిన సత్యాగ్రహ నిరసన కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రజల ఆదరణ కోల్పోతున్నామని గ్రహించిన బీజేపీ కుల, మతాలను రాజకీయాల్లోకి తీసుకొస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హిందువులతో పాటు ముస్లింలు, క్రైస్తవులు సహా అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అండగా ఉంటుందని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగడమే కాంగ్రెస్ విధానమని స్పష్టం చేశారు.
రేషన్ కార్డుల విషయంలో బీజేపీ ఎంపీలు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్యే తప్పుబట్టారు. రేషన్ కార్డులపై ఎవరి ఫొటోలు ఉన్నాయనే అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చడం సరికాదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్న బీజేపీ నాయకులు ముందుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టిందని నాయిని తెలిపారు. గత ప్రభుత్వాల కాలంలో పెండింగ్‌లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. ప్రజలకు ప్రయోజనం కలిగించే పథకాల అమలును అడ్డుకునే ప్రయత్నాలు చేయడం రాజకీయంగా సరైన పద్ధతి కాదని అన్నారు.
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వంటి సీనియర్ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బీజేపీ నాయకుల రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత స్థాయికి దిగజారి మాట్లాడటం ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధమన్నారు.
రాజకీయ నాయకులు పరస్పరం గౌరవించుకుంటూ ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని సూచించారు. గతంలో ప్రత్యర్థి పార్టీల నాయకుల మధ్య కూడా పరస్పర గౌరవం, సలహాలు తీసుకునే రాజకీయ సంస్కృతి ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికలను ఉపయోగించుకొని వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, మతాలను అగౌరవపరచడం మంచి రాజకీయ సంప్రదాయం కాదన్నారు.
బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలు వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే ఆరోపించారు. రైల్వేలు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజా సంస్థలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, పేదల సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం సరికాదన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటిస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని, రాజకీయాల్లో పద్ధతి, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అక్కడి నుంచి పాదయాత్రగా పబ్లిక్ గార్డెన్‌లోని గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ, డీసీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

