Friday, August 14, 2026

Buy now

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి

* మౌలిక వసతులను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
* 20 క్రీడాంశాలకు పటిష్ట ఏర్పాట్లు.. ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026 పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌లో పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే వేగవంతం చేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మంత్రి వాకిటి శ్రీహరి తో కలిసి ఉన్నతాధికారులతో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026 ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌లోని స్టేడియంల ప్రస్తుత పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి, భవిష్యత్‌లోనూ ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

* ప్రారంభ, ముగింపు వేడుకలకు ప్రత్యేక ప్రణాళిక

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు.

మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, క్రీడాకారులు, అతిథులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు సంబంధించి శాఖల వారీగా పని విభజన చేసుకుని బాధ్యతలను అప్పగించాలని సూచించారు.

తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు జాతీయ స్థాయి క్రీడా ప్రతినిధులను కూడా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు.

* 20 క్రీడాంశాలకు ఏర్పాట్లు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా 20 రకాల క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో క్రీడల వారీగా పోటీ ప్రదేశాలను ముందుగానే గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించేలా పోటీల నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) చైర్మన్ శివసేనారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, SATG ఎండీ ఎ. సోనీబాల దేవి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular