ములుగు:ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా గణన ఫారాల పంపిణీ ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి, ఐఏఎస్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, గణన ఫారాలను బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) మాత్రమే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికార వ్యక్తుల ద్వారా గణన ఫారాల పంపిణీ జరగకూడదని సూచించారు.
బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి అర్హత కలిగిన ఓటర్లకు గణన ఫారాలను అందజేయాలని తెలిపారు. ప్రతి ఓటరు తన గణన ఫారాన్ని సమర్పించేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
గణన ఫారాలను సమర్పించిన ఓటర్ల వివరాలు మాత్రమే ముసాయిదా ఓటరు జాబితాలో కొనసాగుతాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.

