Thursday, July 16, 2026

Buy now

గిరిజనులకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలి.. సాంకేతిక సేవలను ప్రజలకు చేరవేయాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల:రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జోన్ పరిధిలోని మాదారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు మరింత స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంతో పాటు పోలీస్ శాఖలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక సేవలను సమర్థంగా వినియోగించి ప్రజలకు చేరవేయాలని అధికారులకు సూచించారు.

స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, ఎస్‌ఐ సౌజన్య పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన స్టేషన్ పరిసరాలు, స్వాధీనం చేసుకున్న వాహనాలు, క్రీడా ప్రాంగణం, పోలీస్ వాహనాల నిర్వహణను పరిశీలించారు.

ప్రతి పోలీస్ వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, తాళ్లు, ట్రాఫిక్ కోన్స్, క్రైమ్ ప్రొటెక్షన్ రిబ్బన్, రైట్ గేర్ కిట్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును పరిశీలించి కంట్రోల్ రూమ్ సిబ్బంది స్పందనను పరీక్షించారు. అలాగే స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలను సమీక్షించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులు, సమస్యలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విస్తారమైన గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రజలతో సున్నితంగా వ్యవహరిస్తూ వారి విశ్వాసాన్ని పొందేలా పనిచేయాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్, హాక్ ఐ, టీఎస్ కాప్ వంటి ఆధునిక సాంకేతిక సేవలను సమర్థంగా వినియోగించాలని, పాస్‌పోర్ట్ ధృవీకరణ, ఆన్‌లైన్ ఫిర్యాదులు, ఇతర సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. యువత కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.

మహిళల భద్రత, చిన్నారుల రక్షణ కోసం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని సూచించిన కమిషనర్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల దుష్పరిణామాలపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు, సైబర్ నేరాల నివారణ, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో నిరంతర చైతన్యం కల్పించాలని పేర్కొన్నారు.

విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్, ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించి నేరాల నియంత్రణతో పాటు ముందస్తు సమాచార సేకరణపై దృష్టి సారించాలని సూచించారు. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

తనిఖీ అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటిన కమిషనర్, మాదారం పోలీస్ స్టేషన్ నిర్వహణ, సౌకర్యాలు, పనితీరు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ ఎస్‌ఐ, సీఐతో పాటు స్టేషన్ సిబ్బందిని అభినందించారు.

Related Articles

spot_img

Most Popular