Thursday, July 16, 2026

Buy now

గ్రంథాలయాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి:ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

* నూతన చైర్మన్ మీసాల ప్రకాష్‌కు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శుభాకాంక్షలు

పాలకుర్తి:వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్‌గా నియమితులైన ప్రకాష్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తన నియామకానికి సంబంధించిన వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేస్తూ, ఈ నెల 11న నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు.

ఆహ్వానాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రకాష్‌ కు అభినందనలు తెలియజేస్తూ, నూతన బాధ్యతల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థను మరింత బలోపేతం చేసి విద్యార్థులు, యువత, ఉద్యోగార్థులకు ఉపయోగపడే విధంగా ఆధునిక సేవలను విస్తరించాలని ఆకాంక్షించారు.

గ్రంథాలయాలు కేవలం పుస్తకాలు చదివే కేంద్రాలే కాకుండా విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షల సన్నద్ధతకు మార్గదర్శక కేంద్రాలుగా మారాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా గ్రంథాలయాల్లో ఈ-లైబ్రరీలు, డిజిటల్ రీడింగ్ సౌకర్యాలు, పోటీ పరీక్షల అధ్యయన కేంద్రాలను అభివృద్ధి చేసే దిశగా కృషి చేయాలని సూచించారు.

అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాల వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, విద్యార్థుల్లో పుస్తక పఠన అలవాటును ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, విజ్ఞానాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆ లక్ష్య సాధనలో గ్రంథాలయ సంస్థ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.

ప్రకాష్ మాట్లాడుతూ, తనపై ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకులకు మెరుగైన సౌకర్యాల కల్పన, యువతకు ఉపయోగపడే వినూత్న కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. ప్రజల సహకారంతో గ్రంథాలయాలను విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.సమావేశం ఆత్మీయ వాతావరణంలో సాగగా, నూతన బాధ్యతల్లో ప్రకాష్ విజయవంతం కావాలని ఎమ్మెల్యే మరోసారి ఆకాంక్షించారు.

Related Articles

spot_img

Most Popular