Wednesday, July 15, 2026

Buy now

గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి:కలెక్టర్ కోయ శ్రీహర్ష

* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* ఇందిరమ్మ గృహాల అర్హుల జాబితాను గెజిటెడ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి
* ఎంపీడీవోలు సమన్వయంతో పారదర్శకంగా గృహాల ధృవీకరణ పూర్తి చేయాలి

మన తెలంగాణ/​పెద్దపల్లి ప్రతినిధి : గ్రామాల అవసరాలకు అనుగుణంగా గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ను రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని, చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, మంజూరైన నిధులతో పూర్తయిన పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

​గ్రామ వనరులను వినియోగించుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ తమ పరిధిలో ఉన్న సహజ వనరులు, స్థానిక ఆదాయ మార్గాలను గుర్తించి, పంచాయతీ ఆదాయాన్ని పెంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు.

ఆర్థికంగా బలోపేతం అయితేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని,గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని,ఘన వ్యర్థాల నిర్వహణ ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డు కలిగిన ప్రతి గ్రామీణ పేద కుటుంబానికి 125 రోజుల పని దినాలు కల్పించాలని, తద్వారా కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, మహిళా సంఘాల కార్యకలాపాలకు ఉపయోగపడే వీఓ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ​ప్రతి గ్రామ పంచాయతీ రాబోయే మూడు సంవత్సరాల కాలానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ను రూపొందించుకోవాలని, ఇది కేవలం పత్రాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు.

ఇందిరమ్మ కమిటీ ప్రతిపాదించిన గృహాల అర్హుల జాబితాను గెజిటెడ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రక్రియలో మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు) సమన్వయ బాధ్యతలు చేపట్టి, తమ పరిధిలోని గెజిటెడ్ అధికారులకు గృహాల ధృవీకరణ బాధ్యతలను కేటాయించాలని ,ధృవీకరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పి సీఈఓ నరేందర్, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, సంబంధిత అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular