Saturday, August 15, 2026

Buy now

గ్రామీణ పారిశుద్ధ్య సేవలపై కేంద్ర బృందం అధ్యయనం

* ములుగు జిల్లాలోని చల్వాయి, మేడారం గ్రామాల్లో రెండు రోజుల క్షేత్రస్థాయి పరిశీలన
* స్వచ్ఛ భారత్ మిషన్ కింద పారిశుద్ధ్య సేవల నిర్వహణపై అధ్యయనం
* అధ్యయన బృందానికి పూర్తి సహకారం అందించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం

ములుగు: గ్రామీణ పారిశుద్ధ్య సేవల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వ బృందం ములుగు జిల్లాలోని చల్వాయి, మేడారం గ్రామాల్లో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.

కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కింద గ్రామీణ పారిశుద్ధ్య ఆస్తులు, సేవల నిర్వహణకు భవిష్యత్తులో అవసరమయ్యే నిధుల అంచనాపై అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ (IEG) బృందం, యూనిసెఫ్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ఇటువంటి అధ్యయనాలు దోహదపడతాయని అన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సమగ్ర నివేదిక సమర్పించాలని బృందాన్ని కోరారు. సంబంధిత శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో అధ్యయన బృందానికి అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు.

భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ అధ్యయనం ద్వారా గ్రామీణ పారిశుద్ధ్య మౌలిక సదుపాయాల నిర్వహణ, నిర్వహణ వ్యయాలు, భవిష్యత్ నిధుల అవసరాలను అంచనా వేయనున్నారు.

దేశవ్యాప్తంగా తెలంగాణ, అసోం, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ అధ్యయనం చేపడుతుండగా, తెలంగాణలో ములుగు, నారాయణపేట జిల్లాలను ఎంపిక చేశారు. ములుగు జిల్లాలో చల్వాయి, మేడారం గ్రామ పంచాయతీలను అధ్యయనానికి ఎంపిక చేశారు.

ఆగస్టు 5, 6 తేదీల్లో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి గ్రామీణ పారిశుద్ధ్య సేవలు, మౌలిక సదుపాయాల నిర్వహణపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనుంది.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎం. సంపత్‌రావు, ఐఈజీ బృంద సభ్యులు డాక్టర్ నితీష్ ఖన్నా, అనుకేత్, యూనిసెఫ్ రాష్ట్ర సమన్వయకర్త శ్రీహరి నక్క, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జి. రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి కె. వెంకయ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular