Friday, August 14, 2026

Buy now

చిన్న కాంట్రాక్టర్లను వేధించొద్దు.. గనుల శాఖ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక

హైదరాబాద్: రోడ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మట్టి, మెటల్ వంటి నిర్మాణ సామగ్రి అనుమతుల పేరుతో చిన్న, నిజాయితీగల కాంట్రాక్టర్లను గనుల శాఖ అధికారులు వేధించవద్దని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామితో కలిసి సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్‌ను నియంత్రించాల్సిన అధికారులు, ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేసే కాంట్రాక్టర్లపై మెటీరియల్ విలువ కంటే పది రెట్లు అధికంగా జరిమానాలు విధించడం సరికాదని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిజాయితీగా పనిచేసే కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు.

కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద చేపట్టిన నాణ్యమైన రోడ్ల నిర్మాణ పనులను ఆగస్టు 2028 నాటికి పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి, టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ బి.వి. రావు, మైనింగ్ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular