పెద్దపల్లి : వరుస చైన్ స్నాచింగ్‌లు, ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన భవారియా గ్యాంగ్ సభ్యుడిని పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన కలిరామ్ (38)గా గుర్తించారు. మరో నిందితుడు కపిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితులు రైళ్లలో పెద్దపల్లికి చేరుకుని ముందుగా బైక్‌లను దొంగిలించి, వాటిపై తిరుగుతూ రోడ్డుపై ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు చైన్లు, పుస్తెల తాళ్లను లాక్కెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. 2026 మార్చి 30న పెద్దపల్లి రైల్వే స్టేషన్లో దిగిన నిందితులు ఓ ఇంటి ముందు పార్క్ చేసిన పల్సర్ 220 బైక్ దొంగిలించి, బంధంపల్లి వద్ద మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు.
అదే రోజు రామగుండం ఓల్డ్ బజార్లో మరో మహిళ మెడలోని సుమారు 45 గ్రాముల బంగారు పుస్తెల తాడును అపహరించారు. అదేవిధంగా మే 29న పెద్దపల్లి బస్‌స్టాండ్ వద్ద మరో బైక్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించగా, ఆ బైక్‌ను బెల్లంపల్లి వద్ద వదిలి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోయారు.
ఆగస్టు 17న తిరిగి పెద్దపల్లికి వచ్చిన నిందితులు కాలేజీ మైదానం సమీపంలో బైక్‌ను దొంగిలించి, లక్ష్మీనగర్‌లో మహిళ మెడలోని సుమారు 30 గ్రాముల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. వరుస ఘటనలపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలతో, పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, ఏసీపీ కృష్ణ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితులు భవారియా గ్యాంగ్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడు కలిరామ్ను బుధవారం ఉదయం పెద్దపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు కపిల్ కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ నరేశ్ లను ఏసీపీ అభినందించారు.

