* జిల్లా కలెక్టర్‌కు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేతల వినతి
పెద్దపల్లి : జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మల్లవర్జల వంశీ విద్యానంద్, జిల్లా కార్యదర్శి నారాయణదాసు అశోక్ , తదితరులు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వినతిపత్రం అందజేశారు. జిల్లాలో వివిధ దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో సుమారు 600 మందికి పైగా జర్నలిస్టులు చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వానికి -ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న తమ పిల్లలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నారని పేర్కొన్నారు. గత కొంతకాలంగా జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలు జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ కల్పిస్తున్నాయని, జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఈ విషయంలో సహకారం అందిస్తున్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించేలా జిల్లా యంత్రాంగం చొరవ తీసుకుని విద్యా సంస్థలతో సమన్వయం చేసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు పాలకుర్తి విజయ్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు టీకే శ్రీనివాస్, జిల్లా కమిటీ నాయకులు ముత్యాల నరసయ్య, జక్కుల సత్యనారాయణ, ఎండి జబ్బర్ ఖాన్, బాలసాని రాజయ్య, మంథని రమేష్, వీరమల్ల విద్యాసాగర్ రావు,ఆకుల రమేష్, తాటిపెల్లి శ్రీనివాస్, తిరుమల సురేష్, రంజిత్, జైపాల్, ఇబ్రహీం, జర్నలిస్టులు పాల్గొన్నారు.

