Friday, August 14, 2026

Buy now

జీఎస్టీ ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ ఫోకస్.. ఏఐతో పన్నుల లీకేజీలకు చెక్

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం, పటిష్ట కార్యాచరణపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం విస్తృతంగా చర్చించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసే మార్గాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై అరవింద్ సుబ్రమణియన్‌తో సీఎం చర్చించారు. జీఎస్టీ అధికారులకు ఏఐ ఆధారిత సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి పన్నుల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతూనే సులభతర వాణిజ్యానికి (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

పన్నుల లీకేజీలను అరికట్టేందుకు శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో లీకేజీల నివారణకు మున్సిపల్, రెరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖలను ఏఐ ఆధారిత సమగ్ర వ్యవస్థతో అనుసంధానించాలని సూచించారు.

భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామగ్రి అవసరాలు, వాటికి సంబంధించిన పన్నుల అంచనాలను నమోదు చేసే విధానం అమలు చేయాలని సీఎం పేర్కొన్నారు. అలాగే మీసేవా, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర డేటాను సమీకృతం చేసి పరిపాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు.

ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular