* అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ ఇళ్ల స్థలాలు మంజూరు
* పెద్దపల్లిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల కేటాయింపు
* ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే విజయరమణరావు హామీ
ప్రజానావ,బ్యూరో,పెద్దపల్లి : పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్,స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు భరోసా ఇచ్చారు. Way2News ఆధ్వర్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం బుధవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు నిర్వహించిన డయల్ యువర్ పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే – ఐజేయు పెద్దపల్లి మండల అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ వీరమల్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యేతో ఫోన్ ద్వారా మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల వేళ జర్నలిస్టులకు ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలకుల నిర్లక్ష్యంతో ఇళ్ల స్థలాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే తమ గోడును వెళ్లగక్కుతున్నామని, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనం కోసం అనువైన స్థలాన్ని కేటాయించాలని, జర్నలిస్టుల సంక్షేమం దృష్ట్యా వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.
దీనిపై ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు సానుకూలంగా స్పందిస్తూ ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకూ త్వరలోనే ఇళ్ల స్థలాలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రెస్ క్లబ్ భవనం కోసం స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

