Monday, July 27, 2026

Buy now

డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనం.. 12 పైసలు పతనం

* 96.42 వద్ద ప్రారంభమైన దేశీయ కరెన్సీ
* ముడిచమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరగడం, అమెరికా డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి బలహీనపడింది. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు క్షీణించి 96.42 వద్ద ట్రేడైంది. మునుపటి ముగింపు ధర 96.30తో పోలిస్తే సోమవారం రూపాయి 96.53 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. అనంతరం కొంత కోలుకుని 96.42 వద్ద ట్రేడైంది. కాగా శుక్రవారం రూపాయి 12 పైసలు బలపడి 96.30 వద్ద ముగిసింది.

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరి యుద్ధ వాతావరణం ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.45 శాతం పెరిగి 90.26 డాలర్లకు చేరుకుంది. హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాకు అంతరాయం ఏర్పడటంతో చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. దీంతో డాలర్‌కు డిమాండ్ పెరిగి రూపాయిపై ఒత్తిడి పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. సెన్సెక్స్ 593.78 పాయింట్లు నష్టపోయి 77,557.67 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 169.20 పాయింట్లు పడిపోయి 24,165.10 వద్ద కొనసాగింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) శుక్రవారం నికరంగా రూ.376.41 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

ప్రపంచ ప్రధాన ఆరు కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ బలాన్ని సూచించే డాలర్ ఇండెక్స్ స్వల్పంగా 0.05 శాతం తగ్గి 100.54 వద్ద కొనసాగింది. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జూలై 10తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు 96.4 కోట్ల డాలర్లు పెరిగి 6,751.57 కోట్ల డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో కూడా నిల్వలు 726 కోట్ల డాలర్లు పెరిగాయి. అయితే ఈ సానుకూల అంశం రూపాయి పతనాన్ని అడ్డుకోలేకపోయింది.

Related Articles

spot_img

Most Popular