Friday, August 14, 2026

Buy now

డిసెంబర్‌ టార్గెట్‌.. మూడు పబ్లిక్‌ స్కూళ్లు

* పైలట్‌ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి
* మంచాల, వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలపై ఉన్నతస్థాయి సమీక్ష
* ఫర్నిచర్‌ కోసం జైళ్ల శాఖతో సమన్వయం చేసుకోవాలి: నవీన్‌ నికోలస్‌

హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ (టీపీఎస్‌) పై విద్యా కమిషన్‌ ప్రత్యేక దృష్టి సారించింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా మంచాల, వంగూరు, పోల్కంపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న పబ్లిక్‌ స్కూల్స్‌ నిర్మాణ పనులను డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రతి బుధవారం ఈ పాఠశాలల పనులపై ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్న విద్యా కమిషన్‌.. పనుల్లో మరింత వేగం పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు మూడు పాఠశాలల్లో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతి, నిధుల విడుదల, మౌలిక వసతులు, ఫర్నిచర్‌ తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో డైరెక్టర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నవీన్‌ నికోలస్‌, విద్యా కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ చారకొండ వెంకటేష్‌, జోష్నా శివారెడ్డి, ప్రొఫెసర్‌ పి.ఎల్‌. విశ్వేశ్వర్‌, తెలంగాణ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ గణపతి రెడ్డి పాల్గొన్నారు. ఆరుట్ల, వంగూరు, పోల్కంపల్లి, మంచాల పాఠశాలల హెచ్‌ఎంలు, కాంట్రాక్టర్లు కూడా సమావేశానికి హాజరయ్యారు.

* పనుల్లో జాప్యం వద్దు:

మంచాల, వంగూరు, పోల్కంపల్లి పాఠశాలల్లో పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులు సమీక్షించారు. కొన్ని పనులకు సంబంధించిన నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై కూడా చర్చించారు.

నిధుల సమస్యతో పనులు నిలిచిపోకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని నవీన్‌ నికోలస్‌ సూచించారు. పైలట్‌ ప్రాజెక్టులోని మూడు పాఠశాలల్లో మిగిలిన పనులను వేగవంతం చేసి **డిసెంబర్‌ గడువులోగా పూర్తి చేయాలని** స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

* జైళ్ల శాఖ నుంచి ఫర్నిచర్‌:
మూడు పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్‌ను జైళ్ల శాఖ ద్వారా సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో ఖైదీలు తయారు చేసే ఫర్నిచర్‌ను టీపీఎస్‌లకు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రతి పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్‌ వివరాలతో పూర్తి ఇండెంట్‌ సిద్ధం చేయాలని హెచ్‌ఎంలను నవీన్‌ నికోలస్‌ ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల అవసరాలకు అనుగుణంగా డెస్క్‌లు, బెంచీలు, టేబుళ్లు, కుర్చీలు తదితర ఫర్నిచర్‌ అవసరాలను ముందుగానే గుర్తించి ఇండెంట్‌ రూపొందించాలని సూచించారు. పాఠశాల భవనాల పనులు పూర్తయ్యే సమయానికి ఫర్నిచర్‌ కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

* ఎంబీల నమోదులో ఇబ్బందులు లేకుండా చూస్తాం:
మూడు టీపీఎస్‌లలో ఇప్పటివరకు పూర్తయిన పనులకు సంబంధించి ఎంబీలు (మెజర్‌మెంట్‌ బుక్స్‌) నమోదు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ గణపతి రెడ్డి తెలిపారు. పనుల కొలతలు, రికార్డుల నిర్వహణ, బిల్లుల ప్రక్రియ తదితర అంశాల్లో సమన్వయంతో వ్యవహరిస్తామని చెప్పారు.

పాఠశాలల అభివృద్ధి పనుల్లో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సమావేశంలో సూచించారు. అధికారులు, హెచ్‌ఎంలు, నిర్మాణ సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

డిసెంబర్‌ నాటికి మూడు పబ్లిక్‌ స్కూళ్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, విద్యార్థులకు ఆధునిక వసతులతో కూడిన మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని విద్యా కమిషన్‌ సూచించింది.

Related Articles

spot_img

Most Popular