*బియ్యం ఎగుమతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలపై పరిశీలన
*విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతులు, రైస్ మిల్లర్లకు రెట్టింపు లాభాలు
హైదరాబాద్: తెలంగాణలో బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయి బియ్యం ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో కేసీపీ న్యూట్రీ సంస్థ రూపొందించిన మల్టీ విటమిన్ రైస్ ఉత్పత్తులను సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న బియ్యానికి దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ భారీ అవకాశాలు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
“భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తుంది. అయితే ఆ ధాన్యం ఎగుమతుల కోసం కాదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానంతో ముందుకు వెళ్లి బియ్యం ఎగుమతులను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతోంది” అని మంత్రి తెలిపారు.
రైతులు, రైస్ మిల్లర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దేశీయ మార్కెట్లతో పాటు విదేశీ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ఎగుమతులు చేపట్టే పరిశ్రమలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది
తెలంగాణ వ్యవసాయ రంగం సాధించిన పురోగతిని వివరిస్తూ మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత యాసంగి సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. అదే సమయంలో భౌగోళికంగా పెద్ద రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని పేర్కొన్నారు.
“ఇది తెలంగాణ వ్యవసాయ సామర్థ్యానికి, రైతుల శ్రమకు, ప్రభుత్వ రైతు అనుకూల విధానాలకు నిదర్శనం” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే రూ.19,303 కోట్లను నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు. పారదర్శకంగా, వేగంగా రైతులకు చెల్లింపులు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.
వానాకాలం, యాసంగి సీజన్లను కలిపి చూస్తే రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తి 300 లక్షల మెట్రిక్ టన్నులు (300 ఎల్‌ఎంటీలు) దాటిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజల వార్షిక వినియోగం సుమారు 36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండటంతో తెలంగాణ మిగులు బియ్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారు.
విలువ ఆధారిత ఉత్పత్తులే భవిష్యత్తు
రైస్ పరిశ్రమ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని మంత్రి సూచించారు. మల్టీ విటమిన్ రైస్, ఫోర్టిఫైడ్ రైస్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశముందని తెలిపారు.
“తెలంగాణలో మాత్రమే విక్రయాలపై ఆధారపడకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను లక్ష్యంగా చేసుకోవాలి. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలు, విదేశీ మార్కెట్లకు చేరేలా ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుంది” అని మంత్రి అన్నారు.
సాగునీటి విస్తరణతో పెరిగిన ధాన్యం ఉత్పత్తి
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, నీటి లభ్యత పెంపు కారణంగానే ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. సాగునీటి రంగంలో ప్రభుత్వం చేపట్టిన పెట్టుబడుల ఫలితంగా తెలంగాణ దేశంలో అగ్రగామి ధాన్య ఉత్పత్తి రాష్ట్రంగా ఎదిగిందన్నారు.
రైతుల ఆదాయాన్ని పెంచడం, రైస్ మిల్లింగ్ పరిశ్రమను బలోపేతం చేయడం, బియ్యం ఎగుమతుల ద్వారా తెలంగాణకు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

