Friday, August 14, 2026

Buy now

తెలంగాణలో రేషన్‌ కార్డుదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

# స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం

హైదరాబాద్:స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంగా తెలంగాణలో రేషన్‌ కార్డుదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గతంలో రాష్ట్రంలో 2.81 కోట్ల మంది రేషన్‌ కార్డు లబ్ధిదారులు ఉండగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రేషన్‌ కార్డులు జారీ చేసి మరో 62 లక్షల మందికి లబ్ధి చేకూర్చిందని మంత్రివర్గం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం **3.42 కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారులు** ఉండగా, వారందరికీ స్మార్ట్‌ రేషన్‌ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

# డిసెంబర్‌లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0

గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా “తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0” నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి ఆధ్వర్యంలో సబ్‌ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈసారి ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ థీమ్‌తో సదస్సును నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’ ప్రణాళికను ఆవిష్కరించనున్నారు. డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, ఫార్మా రంగాల్లో తెలంగాణలో ఉన్న పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు.

మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడి మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను వెల్లడించారు.

# సన్న ధాన్యం సాగుకు ప్రోత్సాహం

వానాకాలం పంటలో ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ రకాల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది.

యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని మంత్రివర్గం పేర్కొంది. ఈసారి రికార్డు స్థాయిలో 81.16 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 63.62 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించనుండగా, మిగిలిన 17.54 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.

ఇటీవల మొక్కజొన్న ఈ-వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చిన నేపథ్యంలో, మిగులు ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,389 బేసిక్‌ ప్రైస్‌ నిర్ణయించి ఈ-వేలం ద్వారా విక్రయించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

# యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు

రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌ కాలేజీలను యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న ఈ సంస్థలను ఇకపై శక్తి శాఖ పరిధిలోకి విలీనం చేయాలని నిర్ణయించారు.

ఆదిలాబాద్‌, నిర్మల్‌, ముధోల్‌, బోథ్‌, సిర్పూర్‌, గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల్లో కొత్తగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలో తొలి విడతగా 113 నియోజకవర్గాల్లో స్కూల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చర్యలు చేపట్టగా, ఇప్పటివరకు 86 స్కూల్‌ కాంప్లెక్స్‌లకు అనుమతులు మంజూరయ్యాయి.

# హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు రూ.200 కోట్ల పథకం

కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి హైదరాబాద్‌ను గ్రీన్‌ సిటీగా మార్చేందుకు మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ప్రస్తుతం ఉన్న 18,766 పెట్రోల్‌, డీజిల్‌ ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చేందుకు రూ.200 కోట్లతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌ స్కీమ్‌** అమలు చేయడానికి ఆమోదం తెలిపింది.

ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల సబ్సిడీ అందించనున్నారు. ప్రస్తుత ఆటోకు ఎలక్ట్రిక్‌ కిట్‌ అమర్చుకోవడంతో పాటు, పాత వాహనాన్ని స్క్రాప్‌ చేసి కొత్త ఎలక్ట్రిక్‌ ఆటో కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు.

హైదరాబాద్‌ నగర పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమలను నగర శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన HILT పాలసీ దరఖాస్తు గడువును మరో మూడు నెలలు పొడిగించారు. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్‌ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

# ఎత్తిపోతల పథకాలకు ఆమోదం

మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం ఫేజ్‌-II పనులకు రూ.2,100 కోట్ల అంచనా వ్యయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు, ఆయా ప్రాంతాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించేందుకు అవకాశం కలగనుంది.

అలాగే గూడెందొడ్డి పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు, అలాగే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియమించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Related Articles

spot_img

Most Popular