పాలకుర్తి:దేవరుప్పుల మండలం దారవత్ తండా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన హకా రైతు సేవా కేంద్రాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, రైతులకు అందించనున్న సేవలపై నిర్వాహకులతో మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక సలహాలు ఒకే చోట అందుబాటులో ఉండేలా రైతు సేవా కేంద్రాలు పనిచేయడం అభినందనీయమని అన్నారు.
వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవచ్చని, నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, నాణ్యమైన విత్తనాల ఎంపిక, సమయానుకూలంగా పంట సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఎమ్మెల్యే సూచించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, రైతులకు అవసరమైన సమయంలో విత్తనాలు, ఎరువులు, సాగునీరు, పెట్టుబడి సాయం వంటి అంశాల్లో ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటోందని తెలిపారు. రైతుల ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు.
హకా రైతు సేవా కేంద్రం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే, రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు, సరైన సలహాలు అందిస్తూ వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని కోరారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దవేర అనిల్, మాజీ నాయకుడు నల్ల శ్రీరామ్, సీనియర్ నాయకులు ధర్మారెడ్డి, రెడ్డిరాజుల రమేష్, సజ్జన్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ అధికారులు, రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

