మనసున్న ప్రభుత్వం మంచి కార్యక్రమం
హెలెన్ కెల్లర్ స్ఫూర్తితో దివ్యాంగులకు మరింత అండగా తెలంగాణ ప్రభుత్వం
14 నైబర్‌హుడ్ సెంటర్లకు ఈ-ఆటోల పంపిణీ
హైదరాబాద్: దివ్యాంగుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంలో మరో కీలక అడుగు వేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్రంలోని 14 నైబర్‌హుడ్ సెంటర్లకు ఈ-ఆటోలను ప్రారంభిస్తూ ఆమె మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, సెర్ప్ లో దివ్యాంగుల సంక్షేమ విభాగ డైరెక్టర్ ఎల్ కృష్ణమూర్తి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు పీయూష్ మిట్టల్, కైలాష్, అధికారులు, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికే స్ఫూర్తి అని మంత్రి సీతక్క అన్నారు. చిన్న వయసులోనే చూపు, వినికిడి కోల్పోయినా సంకల్పబలంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె చెప్పిన “ఒంటరిగా మనం చాలా తక్కువ చేయగలం… కలిసి ఉంటే ఎంతో సాధించగలం” అనే సందేశం ఈ కార్యక్రమానికి సరిగ్గా సరిపోతుందని అన్నారు.
దివ్యాంగులను జాలి చూపాల్సిన వారిగా కాకుండా సమాజ అభివృద్ధిలో సమాన భాగస్వాములుగా చూడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ విధానమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దివ్యాంగులకు విద్య, ఉపాధి, పునరావాసం, జీవనోపాధి రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
గత రెండు దశాబ్దాలుగా మహిళల సాధికారత కోసం విశేషంగా పనిచేస్తున్న సెర్ప్‌కు ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమ బాధ్యతలను కూడా అప్పగించిందని తెలిపారు. మహిళా సంఘ సభ్యుల దివ్యాంగ పిల్లలకు ఈ లోటు రాకుండా చూసుకునే బాధ్యత అప్పగించామన్నారు.
సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, డైరెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తక్కువ కాలంలోనే దివ్యాంగులను సంఘటితం చేసి రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకుపైగా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రస్తుతం 82 వేల మందికి పైగా సభ్యులు ఈ సంఘాల్లో ఉన్నారని తెలిపారు. స్త్రీనిధి ద్వారా రూ.38.16 కోట్ల రుణాలు, గ్రామ మహిళా సంఘాల ద్వారా రూ.4.13 కోట్ల రుణాలు, రూ.11.62 కోట్ల పొదుపులు,2,248 మందికి జీవనోపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
ప్రస్తుతం 26 జిల్లాల్లో 74 నైబర్‌హుడ్ సెంటర్ల ద్వారా కమ్యూనిటీ మేనేజ్డ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కార్యక్రమాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైబర్హుడ్ సెంటర్ల లో దాదాపు మూడు వేల మంది దివ్యాంగ పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ప్రత్యేక విద్య, కౌన్సెలింగ్, నైపుణ్యాభివృద్ధి వంటి సేవలు అందుతున్నాయని వివరించారు. తల్లిదండ్రులకు శిక్షణ, కౌన్సెలింగ్‌తో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ-ఆటోలు కేవలం వాహనాలు కాదని, ఎన్నో కుటుంబాలకు ఆశను, దివ్యాంగులకు ఆత్మవిశ్వాసాన్ని అందించే సాధనాలని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు రవాణా సమస్యల వల్ల పిల్లలను కేంద్రాలకు తీసుకురాలేకపోయిన కుటుంబాలకు ఇకపై ఇంటి వద్ద నుంచే ఉచిత రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ముఖ్యంగా ఆటిజం, మేధోవైకల్యం తదితర వైకల్యాలు ఉన్న పిల్లలు క్రమం తప్పకుండా థెరపీ, శిక్షణ పొందేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
శారీరక లోపం ఉన్నవారే దివ్యాంగులు కాదని, ఇతరులను అవమానించే మనస్తత్వం, అహంకారం, మానవత్వం లేకపోవడం కూడా ఒక విధమైన వైకల్యమని అన్నారు. దివ్యాంగులను చీదరించకుండా, వారికి అవకాశాలు కల్పిస్తే వారు అద్భుత విజయాలు సాధిస్తారని చెప్పారు. కళ్లు కనిపించకపోయినా బ్రెయిలీ ద్వారా ఉన్నత లక్ష్యాలను చేరుకున్నవారు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. హెలెన్ కెల్లర్ లాగే ప్రతి దివ్యాంగుడిలో అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని అన్నారు.
పుట్టుకతో వచ్చిన వైకల్యాలను కూడా తల్లిదండ్రుల ప్రేమ, ప్రోత్సాహం, సరైన శిక్షణతో ఎంతోవరకు అధిగమించవచ్చని చెప్పారు. దివ్యాంగ పిల్లల పట్ల కుటుంబ సభ్యులు నిరాశ చెందకుండా మరింత శ్రద్ధ చూపాలని సూచించారు.
ముఖ్యమంత్రి సహకారంతో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి త్రిచక్ర వాహనాలు, జీవనోపాధి అవకాశాలు, స్వయం సహాయక సంఘాలు, నైబర్‌హుడ్ సెంటర్లు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల పేరిటే ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటూ వారికి సామాజిక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.
సీఎస్ఆర్ నిధుల ద్వారా ఈ కార్యక్రమానికి సహకరించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, సమాజం కలిసి పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు.
ప్రతి దివ్యాంగుడికి సేవలు వారి ఇంటి సమీపంలోనే అందేలా నైబర్‌హుడ్ సెంటర్లను మరింత బలోపేతం చేస్తామని, అవసరమైన చోట కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలను విస్తరిస్తామని మంత్రి ప్రకటించారు. దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి ప్రజలు సూచనలు ఇవ్వాలని, వాటిని ప్రభుత్వ విధానాల్లో అమలు చేసి వారి జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.
హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా దివ్యాంగులకు జాలి కాదు… గౌరవం, సమాన అవకాశాలు, ఆదరణ ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు సాగుదామని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. అదే హెలెన్ కెల్లర్‌కు మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు

