ప్రజానావ,మల్కాజిగిరి: పుట్టుకతోనే దివ్యాంగుడైన రాహుల్‌కు పోలీస్ అధికారి కావాలన్న చిరకాల కోరికను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి బడుగుల,నెరవేర్చారు. ఒక్కరోజైనా పోలీస్ అధికారి కుర్చీలో కూర్చోవాలన్న అతని ఆకాంక్షకు స్పందించిన సీపీ, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి రాహుల్‌ను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రాహుల్‌ను తన అధికారిక కుర్చీలో కూర్చోబెట్టి, పోలీస్ క్యాప్ ధరింపజేసి ఆప్యాయంగా పలకరించారు. తన చిన్ననాటి కల సాకారమైన ఆనందంలో రాహుల్ ముఖంలో వెల్లివిరిసిన చిరునవ్వు అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.
ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీసులు కర్తవ్య నిర్వహణతో పాటు సమాజం పట్ల మానవత్వాన్ని చాటుతూ, ప్రజల ఆకాంక్షలను గౌరవించడం తమ బాధ్యతలో భాగమని మరోసారి నిరూపించారు. ఈ హృదయాన్ని హత్తుకునే ఘటనకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

