* ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లో నీటి మట్టం, వరద పరిస్థితులపై సమీక్ష
* పూర్తి స్థాయి నీరు చేరే అవకాశం ఉందని అధికారులకు అప్రమత్తత సూచన
* ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కలెక్టర్ ఆదేశం
సిరిసిల్ల: జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్‌ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితె బుధవారం నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం, ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం, ప్రస్తుత పరిస్థితులపై నీటి పారుదల శాఖ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కూడవెల్లి, పాల్వంచ వాగుల నుంచి ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో లేదని, ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.6 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉన్నందున నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి మట్టాన్ని నిరంతరం పరిశీలిస్తూ ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల రైతులు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు.
ప్రాజెక్ట్ మత్తడి పారే పరిస్థితి ఏర్పడితే పోలీస్, రెవెన్యూ అధికారులు వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించాలని కలెక్టర్ సూచించారు.ఈ పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, ప్రశాంత్, తహసీల్దార్ మారుతి, సర్పంచ్ అర్చనతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

