* రాగినేడు శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
* రుద్రాభిషేకం నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందిన ఎన్నారై
* ఆలయ ప్రశాంత వాతావరణం ఆకట్టుకుందని ప్రశంస
పెద్దపల్లి: అమెరికాకు చెందిన ఎన్నారై హర్కర ప్రసాదరావు పెద్దపల్లి మండలంలోని రాగినేడు శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ నాగలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం రుద్రాభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్మించబడిన ఈ ఆలయం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంతో భక్తులను ఆకట్టుకుంటోందని ప్రసాదరావు తెలిపారు.
తొలిసారిగా ఈ ఆలయాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆలయ నిర్మాణం, పరిసరాల ఆహ్లాదకరమైన వాతావరణం తనను ఎంతో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ, గ్రామ సర్పంచ్ సోమా కుమార్, ఉపసర్పంచ్ గుమ్మడి విజయ, ఆలయ నిర్మాణకర్త కోలేటి దామోదర్, మాజీ జడ్పీటీసీ రఘువీర్ సింగ్, కోలేటి శ్రీనివాసులు తదితరులు ఎన్నారై ప్రసాదరావుకు తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించి ఆలయ చిత్రపటాన్ని బహుకరించారు.

