* గ్రామసభ నిర్వహించి ఆలయ అభివృద్ధిపై తీర్మానాలు చేయాలి
* ఈ నెల 24లోగా ‘సర్’ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
* దివ్యాంగురాలు దేవమ్మకు మూడు చక్రాల వాహనం హామీ
ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నాయినోనిపల్లి మైసమ్మ దేవస్థానాన్ని శనివారం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్‌తో కలిసి సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర నలుమూలల నుండి ప్రతి ఆదివారం వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలన్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, రహదారి విస్తరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆలయ అభివృద్ధిపై గ్రామసభ నిర్వహించి తీర్మానాలు చేయాలని, భక్తులు నిర్వహించే విందులు, అన్నదానాలు, మద్యం వినియోగానికి ఈవో ద్వారానే ఒకే ఫీజుతో ఎక్సైజ్ శాఖ అనుమతులు పొందేలా పారదర్శకత పాటించాలని ఈవో శేఖర్ గౌడ్‌ను ఆదేశించారు.
పెద్దకార్పాముల గ్రామంలో కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెల 24వ తేదీలోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిగా ముగించాలని అధికారులను ఆదేశించారు. బిఎల్వోలు విధిగా ప్రతి ఓటరు వివరాలను నమోదు చేస్తూ, అర్హులెవరూ ఓటరు జాబితా నుంచి విస్మరించబడకుండా చూడాలని స్పష్టం చేశారు.
దివ్యాంగురాలికి కలెక్టర్ మానవీయ హామీ:
ఆలయ సందర్శనలో భాగంగా చిన్నకొత్తపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు దేవమ్మ సమస్యను కలెక్టర్ ఓపికగా విన్నారు. తనకు మూడు చక్రాల మోటారు వాహనం కావాలని ఆమె కోరగా, వెంటనే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయించి వాహనం మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అలాగే ఆమెకు పెన్షన్, ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఎస్పీతో కలిసి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజాపాలన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి వి. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, తహసిల్దార్ శ్రీనివాసులు, చైర్మన్ శ్రీనివాస్, ఈవో శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

