Thursday, August 13, 2026

Buy now

నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

* ఆగస్టు 13 నుంచి ప్రత్యేక శస్త్రచికిత్సలు.. ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేదు
* నిమ్స్ డైరెక్టర్ ప్రొ. రాహుల్ దేవరాజ్

ప్రజానావ, హైదరాబాద్: గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్‌లోని నిమ్స్‌ (నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొ. రాహుల్‌ దేవరాజ్‌ తెలిపారు. ఆగస్టు 13 నుంచి ప్రత్యేక శస్త్రచికిత్సలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

గత ఐదేళ్లుగా నిమ్స్‌లో ప్రతి ఏడాది ఉచిత గుండె శస్త్రచికిత్సల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిమ్స్‌ కార్డియోథొరాసిక్‌ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ ప్రొ. అమరేశ్వర్‌ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లండన్‌కు చెందిన వైద్యులు, పీడియాట్రిక్‌ కార్డియాక్‌ సర్జన్‌ డా. రమణ తన్నషునేని, సాంకేతిక నిపుణుల బృందం ఈ కార్యక్రమానికి సహకరించనుంది.

అవసరాన్ని బట్టి చిన్నారులకు ప్రాధాన్యత కేటాయించి వాక్‌-ఇన్‌ విధానంలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న చిన్నారులను గుర్తించి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తారు.

* ముందస్తు అపాయింట్‌మెంట్‌ అవసరం లేదు

అర్హత ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు ముందస్తు అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని నిమ్స్‌ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్‌లోని సీటీ సర్జరీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించారు.

గతంలో చేయించిన వైద్య పరీక్షల నివేదికలు, పాత వైద్య రికార్డులు అందుబాటులో ఉంటే వాటిని వెంట తీసుకురావాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం పంజాగుట్టలోని నిమ్స్‌ సీటీ సర్జరీ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

Related Articles

spot_img

Most Popular