– జూన్ త్రైమాసిక లాభాలు పెరిగినా పెట్టుబడిదారుల్లో నిరాశ
– స్టాక్ మార్కెట్‌లో 6 శాతం వరకు క్షీణించిన షేరు ధర
ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన అనంతరం సోమవారం షేర్లు భారీ ఒత్తిడికి గురయ్యాయి. లాభాలు పెరిగినప్పటికీ మార్కెట్ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోవడంతో పెట్టుబడిదారులు అమ్మకాల బాట పట్టారు. దీంతో బీఎస్‌ఈలో యాక్సిస్ బ్యాంక్ షేరు ధర 6 శాతం పడిపోయి రూ.1,249.05 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈలో 5.97 శాతం క్షీణించి రూ.1,249.10కు చేరింది.
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం 22.23 శాతం పెరిగి రూ.7,632.31 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని బ్యాంకు తెలిపింది. స్టాండలోన్ ప్రాతిపదికన నికర లాభం 23 శాతం పెరిగి రూ.7,114 కోట్లకు చేరుకుంది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 8 శాతం పెరిగి రూ.14,646 కోట్లకు చేరింది. రుణాల పంపిణీ 19 శాతం పెరగడం దీనికి దోహదపడింది. అయితే నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ గత ఏడాది 3.80 శాతం, గత త్రైమాసికంలో 3.73 శాతం ఉండగా, ఈసారి 3.46 శాతానికి తగ్గింది.
స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి మార్చి త్రైమాసికంలో 1.23 శాతం ఉండగా, జూన్ త్రైమాసికంలో అది 1.28 శాతానికి స్వల్పంగా పెరిగింది. అయితే ప్రస్తుత చక్రంలో నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ కనిష్ఠ స్థాయికి చేరిందని, ఇకపై క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరి తెలిపారు. విదేశాల్లోని భారతీయుల నుంచి డిపాజిట్లు ఆకర్షించే ఎఫ్‌సీఎన్‌ఆర్ (బి) పథకం ద్వారా అదనపు లిక్విడిటీ లభించడం వల్ల భవిష్యత్తులో మార్జిన్లకు మద్దతు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

