Friday, August 14, 2026

Buy now

నిర్ణీత గడువులోగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి కావాల్సిందే

* నిర్లక్ష్యం, పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
* మూడు షిఫ్టుల్లో పనులు.. రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు నిరంతరాయంగా నిర్మాణ పనులు
* 2026 అక్టోబర్ 31 నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలి

హైదరాబాద్ (సెక్రటేరియట్): ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సిందేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. పనుల్లో నిర్లక్ష్యం, జాప్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 2026లోనే కారిడార్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై మంగళవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ సీఈ ధర్మారెడ్డి, పలువురు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏళ్ల తరబడి ఉప్పల్ మార్గంలో ప్రయాణించే ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి అన్నారు. ప్రజలకు 2026 దసరా నాటికి కారిడార్‌ను పూర్తి చేస్తామని మాట ఇచ్చామని, ఆ మాట ప్రకారం పనులు పూర్తి చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి జవాబుదారీతనంతో పనిచేస్తోందని, ప్రజలకు సురక్షితమైన, ఇబ్బందులు లేని ప్రయాణాన్ని అందించడమే లక్ష్యమన్నారు.

* మూడు షిఫ్టుల్లో పనులు

పనుల్లో వేగం పెంచేందుకు మ్యాన్‌పవర్‌ను పెంచి మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా పనులు జరగాలని స్పష్టం చేశారు. కారిడార్ కింద చేపడుతున్న 6.25 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి పది రోజులకు ఒకసారి తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు. ప్రతిరోజూ వర్క్ ప్రోగ్రెస్‌ను అధికారులు పరిశీలిస్తూ, వాస్తవ పరిస్థితులను నివేదించాలని ఆదేశించారు.

* 60 శాతం పనులు పూర్తి

ప్రస్తుతం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు సుమారు 60 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 40 శాతం పనులు కొనసాగుతున్నాయని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. సైట్‌లో సెగ్మెంట్ల తయారీ కోసం నాలుగు బెడ్లు, నాలుగు గ్యాంట్రీలతో సుమారు 300 మంది కార్మికులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు.

అటు నారపల్లి (సీపీఆర్‌ఐ) వైపు నుంచి, ఇటు ఉప్పల్ వైపు నుంచి లాంచింగ్ గడ్డర్లతో ఏకకాలంలో పనులు చేపట్టి వేగం పెంచాలని మంత్రి సూచించారు. ఉప్పల్ వైపు ఇప్పటికే ఒక స్లాబ్ పూర్తయిందని, రెండో స్లాబ్ పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

* గడువుపై స్పష్టత

రాత్రివేళల్లో పనులు, వర్షాల కారణంగా నిర్మాణ పనులు పూర్తి చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. అయితే ఈ అంశంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే 2026 అక్టోబర్ 31 నాటికి కారిడార్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డెడ్‌లైన్ నిర్ణయించామని, ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

నెలకు ఆరు స్లాబుల చొప్పున పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. పనుల్లో మరింత వేగం పెంచి, అవసరమైన మ్యాన్‌పవర్‌ను సమకూర్చుకుని మూడు షిఫ్టుల్లో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.

* జీహెచ్‌ఎంసీ పనులతో సమన్వయం

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు అనుసంధానంగా జీహెచ్‌ఎంసీ చేపడుతున్న ఫ్లైఓవర్ పనులపై కూడా మంత్రి ఆరా తీశారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని రెండు పనులు సమాంతరంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

2026 సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా ఆర్‌అండ్‌బీ అధికారులు, నిర్మాణ సంస్థ సమన్వయంతో, పూర్తి బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు.

Related Articles

spot_img

Most Popular