Thursday, July 30, 2026

Buy now

నేతన్నల సంక్షేమం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

* రూ.3.22 కోట్లతో రగుడు జంక్షన్ అభివృద్ధి పనులకు శ్రీకారం – నేతన్నలకు ఆర్డీ పాస్‌బుక్‌ల పంపిణీ*

సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నల సంక్షేమం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఇంచార్జి మంత్రి, మార్కెటింగ్, వ్యవసాయ, చేనేత జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

గురువారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద రూ.3.22 కోట్ల వ్యయంతో చేపట్టనున్న జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ, మోడల్ బస్ షెల్టర్ల నిర్మాణ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ప్రారంభించారు.

అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో త్రిఫ్ట్ ఫండ్ పథకం కింద అర్హులైన వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఆర్డీ పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సిరిసిల్ల చేనేతకు ప్రతీకగా నిలిచిందని, నేతన్నల కష్టానికి ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. గత రెండేళ్లలో చేనేత రంగానికి రూ.1,360 కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఏడాది పొడవునా ఉపాధి కల్పించడంతో పాటు భద్రత, బీమా, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

చేనేత ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ప్రభుత్వం నాణ్యమైన చీరలను కొనుగోలు చేస్తోందని, యార్న్ డిపో ఏర్పాటుతో సహకార సంఘాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. నేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, నేతన్నల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సిరిసిల్లలో నాణ్యమైన ఇందిరా మహిళా శక్తి చీరలు తయారవుతున్నాయని తెలిపారు. సిరిసిల్ల మోడల్ చీరకు జీఐ ట్యాగ్ వచ్చేలా కృషి చేయాలని సూచించారు.

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వస్త్ర పరిశ్రమలో పేరుకుపోయిన బకాయిలను దశలవారీగా విడుదల చేసి నేతన్నల్లో విశ్వాసం పెంచిందన్నారు. 2024–25 సంవత్సరానికి 6.80 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చి వేలాది మందికి ఎనిమిది నెలలపాటు ఉపాధి కల్పించామని తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 3 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చామని, ఇప్పటికే దాదాపు కోటి మీటర్ల చీరల తయారీ పూర్తైందన్నారు. రూ.62 కోట్ల బిల్లులు చెల్లించామని వెల్లడించారు. పవర్‌లూమ్‌లకు విద్యుత్ సబ్సిడీ, వేములవాడలో రూ.50 కోట్లతో యార్న్ బ్యాంక్ ఏర్పాటు వంటి చర్యలు చేపట్టామని తెలిపారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ వేములవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గత ఏడాది తయారైన ఇందిరా మహిళా శక్తి చీరలకు మంచి ఆదరణ లభించిందని, మహిళలు వాటిని పండుగలు, శుభకార్యాల్లో ధరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం చీరల తయారీకి మరోసారి ఆర్డర్లు ఇచ్చిందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఎస్పీ మహేష్ బి. గితే, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూప తదితరులు పాల్గొన్నారు

Related Articles

spot_img

Most Popular