* ఎన్నికల హామీలను అమలు చేయాలి*
* కలెక్టర్ కార్యాలయంలో ఏవో కి వినతి
పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సీపెల్లి రవీందర్, ఎండి ఖాజా లు మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో సుమారు 53 వేల మంది ఉద్యోగులు, కార్మికులు గ్రామాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
ఏళ్ల తరబడి సేవలందిస్తున్నప్పటికీ వారికి ఉద్యోగ భద్రత, పర్మినెంట్, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా వంటి సంక్షేమ సౌకర్యాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనాలు అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే కార్మికులను అక్రమంగా తొలగిస్తున్న సర్పంచులపై చర్యలు తీసుకోవాలని, ఆన్‌లైన్‌లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి. పంచాయతీ సిబ్బందినందరినీ 2వ పీఆర్సీలో గుర్తించి, కనీస వేతనం రూ.26 వేల గా నిర్ణయించాలి. జీవో నెం.51ను సవరించి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి.
కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా కల్పించాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమ చేయాలి. వయస్సు పైబడిన, అనారోగ్యానికి గురైన లేదా మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలి.
ఆన్‌లైన్‌లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలి. అక్రమంగా సిబ్బందిని తొలగిస్తున్న సర్పంచులపై ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మరణించిన కార్మికుల దహన సంస్కారాలకు కనీసం రూ.30 వేల ఆర్థిక సహాయం అందించాలి. పంచాయతీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలి. జిల్లా కలెక్టర్ సమస్యలపై జోక్యం చేసుకొని పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ కోరింది.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పైడిపల్లి నాగయ్యా, కూనమల్ల అశోక్, రెడ్డిమల్ల నాగేశ్వర్, సహాయ కార్యదర్శులు దొడ్ల రాజబాబు, లోకిని శారద, రామస్వామి, దొంత కనుకయ్య, ఎదుల్ల రవి, వైద్య సంపత్, బూడిద రామస్వామి,నాయకులు శంకర్, సదానందం, కలవిన గట్టయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

