# మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ముదిరాజ్ సంఘం నాయకులు
హైదరాబాద్: ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ యోధుడు, ప్రజా నాయకుడు పండుగ సాయన్న జయంతిని అక్టోబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నాయకులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించడంతో పాటు, ఆయన సేవలు, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు ముఖ్యమంత్రిని కోరారు.
అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ప్రస్తుతం ఉన్న బీసీ-డీ కేటగిరీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ముదిరాజ్ సంఘం నాయకుల విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పండుగ సాయన్న జయంతి అధికారిక నిర్వహణతో పాటు ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-ఏ కేటగిరీలోకి మార్చే అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.
ముదిరాజ్ సామాజిక వర్గం అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

