అంతర్గాం: పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. అంతర్గాం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దంపేట గ్రామంలో డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్‌ఐ రమేష్, నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శనివారం దాడి నిర్వహించారు.
ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ధర్మాజీ లక్ష్మణ్(53), లాయిశెట్టి మహేష్(37), బంగారి నారాయణ(55), ఆదిచర్ల శివసాయి(47), మెరుగు వెంకటస్వామి(55), మాచర్ల ఆకాష్(42), ఆసర్ల మల్లేష్(44)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14,730 నగదు, 52 పేకముక్కలు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన ఏడుగురిని, స్వాధీనం చేసుకున్న నగదు, పేకముక్కలు, సెల్‌ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల కోసం అంతర్గాం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడటం, నిర్వహించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

