Tuesday, July 21, 2026

Buy now

పేదలకు సొంతింటి కల సాకారం

– హైదరాబాద్‌ నగరంలోని క్యూర్‌ పరిధిలో ఇళ్ల స్థలాలు
– రూ.10వేలతో ప్లాట్లకు దరఖాస్తులు.. ఆగస్టు 10 వరకు గడువు
– డ్రా పద్ధతిన లబ్ధిదారుల ఎంపిక
– స్థలం కేటాయింపుతో పాటు రూ.5 లక్షల సాయం
– పదేళ్లపాటు విక్రయాలు, అద్దెలకు ఇవ్వడం నిషేధం
– చివరి లబ్ధిదారునికి ఇల్లు అందేవరకు కొనసాగనున్న ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం
– మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ప్రజానావ, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలోని కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, మీ సేవ, వాట్సాప్‌, అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. సోమవారం నాడు సచివాలయంలో సహచర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ తదితరులతో కలిసి క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల బ్రోచర్, మీసేవ, వాట్సాప్ దరఖాస్తులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు రూ.10 వేల టోకెన్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికను పూర్తిగా పారదర్శకంగా డ్రా పద్ధతిలో నిర్వహిస్తామని, డ్రాలో ఇల్లు రాని వారి టోకెన్‌ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. కేటాయించిన ఇళ్ల స్థలాలను పదేళ్లపాటు విక్రయించడం, అద్దెకు ఇవ్వడం నిషేధమని మంత్రి స్పష్టం చేశారు. అయితే బ్యాంకు రుణం కోసం తనఖా పెట్టుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. క్యూర్‌ పరిధిలో ఇల్లు, స్థలం లేని పేదలకు తొలి ప్రాధాన్యం కల్పిస్తామని మంత్రి తెలిపారు. లబ్ధిదారుల పేర్లపై స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేస్తామని, స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సబ్సిడీ అందిస్తామని వెల్లడించారు.

తొలి విడతలో 16 నియోజకవర్గాలు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్ల చొప్పున ప్రయోగాత్మకంగా నిర్మాణాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. త్వరలో మరో 8 నియోజకవర్గాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామని వెల్లడించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హత ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలి విడతగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను ప్రారంభించామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం క్యూర్‌ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో పేదలకు మొత్తం 8 లక్షల ఇళ్లు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గతంలో నగరానికి దూర ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం వల్ల పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. క్యూర్‌ పరిధిలో పేదలకు అందించే ఇళ్ల స్థలాలు విలువైనవిగా ఉంటాయని, సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని చెప్పారు. రూ.40 నుంచి రూ.60 లక్షల వరకు విలువ చేసే స్థలాలను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి అందిస్తామని తెలిపారు. ఇళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు.

బోనాల నాటికి పూర్తి
హైదరాబాద్‌లో జరుగుతున్న బోనాల జాతర సందర్భంగా క్యూర్‌ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషకరమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. వచ్చే ఏడాది బోనాల నాటికి కొత్త ఇందిరమ్మ ఇళ్ల నుంచి పండుగ వేడుకలు నిర్వహించేలా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పేదలకు సొంత ఇల్లు అందించే వరకు ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం కొనసాగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. చివరి అర్హుడికి ఇల్లు అందే వరకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.

పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చారిత్రాత్మక కార్యక్రమమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఎంత విలువైన భూమి అయినా పేదలకు ఉపయోగపడేలా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల కోసం హౌసింగ్‌ కాలనీలు నిర్మించిందని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో స్థలం లేని పేదలు ఎక్కువగా అద్దె ఇళ్లలో జీవిస్తున్నారని, వారికి స్థలం కల్పించి ఇళ్లు నిర్మించి ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హౌసింగ్‌ విభాగాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తాము దానిని పునరుద్ధరించామని అన్నారు. మంత్రి మహ్మద్‌ అజారుద్దీన్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ పరిధిలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టడం శుభపరిణామమని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమ విషయంలో ప్రభుత్వం రాజీపడడం లేదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని బట్టి ప్రతి సోమవారం చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. పేదలతో పాటు మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుందని, త్వరలో వారికి కూడా శుభవార్త అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

నాగరాజుకు రూ.లక్ష బహుమతి
క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరును ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సూచించిన నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన కొండా నాగరాజుకు మంత్రులు రూ.లక్ష నగదు బహుమతిని అందజేశారు. ఈ పథకానికి పేరు సూచించిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించగా, నాగరాజు సూచించిన పేరును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా మంత్రులు ఆయనను సత్కరించారు.

Related Articles

spot_img

Most Popular