* గ్రామ ప్రజల ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
పెంబి: పెంబి మండలం పోచంపల్లి గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న వ్యవసాయ గోదాము నిర్మాణానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమిపూజ చేశారు. ముందుగా కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సంబంధిత అధికారులతో సమస్యలపై చర్చించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోచంపల్లి–అంకేనతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు ఎదురవుతున్న రహదారి సమస్యకు అన్ని గ్రామాల ప్రజల ఐక్యతతో పరిష్కారం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. వారం రోజుల్లో బ్రిడ్జి నిర్మాణానికి రూ.20 లక్షలతో ప్రొసీడింగ్స్ అందిస్తామని హామీ ఇచ్చారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే పోచంపల్లి, పరిసర గ్రామాల్లో నెట్వర్క్ సమస్యను పరిష్కరించేందుకు సెల్ టవర్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అధికారుల నుంచి నివేదికలు తీసుకుని చుట్టుపక్కల గ్రామాలకు నెట్వర్క్ అందేలా సెంటర్ పాయింట్లో టవర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన భూమిని గ్రామస్తులు, అధికారుల సమన్వయంతో సేకరించాలని కోరారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పెంబి మండలంలోని వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

