Friday, August 14, 2026

Buy now

పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ, పుస్తకాలు, భోజన సదుపాయం

* ఆగస్టు 20 నుంచి రెండు నెలలపాటు శిక్షణ: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు
* ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్న భోజనం

మంచిర్యాల: పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మంచిర్యాల జిల్లా యువతకు స్వర్గీయ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూలైలో నిరుద్యోగులకు శుభవార్తగా 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని ఎమ్మెల్యే తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన యువత ఈ నెల 16వ తేదీలోగా పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియకు అవసరమైన సహాయాన్ని రిటైర్డ్ పోలీస్ అధికారి నాగార్జున అందిస్తారని పేర్కొన్నారు.

పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 20న స్వర్గీయ రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఉచిత శిక్షణ ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర్లు థియేటర్ చౌరస్తా సమీపంలోని టీటీడీ మండపంలో రెండు నెలలపాటు శిక్షణ కొనసాగుతుందని చెప్పారు. శిక్షణతో పాటు ఉచితంగా పుస్తకాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తామని వెల్లడించారు.

* విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్న భోజనం

మంచిర్యాల కాలేజీ రోడ్డులోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్ (ఇస్కాన్) ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని మంచిర్యాల నియోజకవర్గానికి అందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తొలుత టిఫిన్ పంపిణీ ప్రారంభమవుతుందని, అనంతరం దసరా వరకు మధ్యాహ్న భోజనం అందిస్తామని చెప్పారు. దసరా తర్వాత ఈ కార్యక్రమాన్ని చెన్నూరులో అమలు చేయనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు మినహా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్న భోజన పథకం వర్తిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

* కాంగ్రెస్ కార్పొరేటర్లపై ప్రచారం అవాస్తవం

కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు తనను విడిచి వెళ్తారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. పార్టీలో విభేదాలు ఉన్నట్లు ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు రేపటి నుంచి తాగునీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular