* జిల్లా అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు
పెద్దపల్లి : ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన కాళోజీ కృషి మరువలేనిదని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారికంగా నిర్వహించిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు మాట్లాడుతూ సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా స్పందించే వ్యక్తిత్వం కాళోజీది అన్నారు. సత్యాగ్రహ మహోద్యమంలో పాల్గొని పిన్న వయసులోనే జైలు జీవితం గడిపారని తెలిపారు. విద్యార్థి దశ నుండే నిజాం ప్రభుత్వం నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప నాయకులు కాళోజీ అని కొనియాడారు.
తెలంగాణ సాధన ఉద్యమంలో కాళోజీ సాహిత్య స్ఫూర్తి, ఆయన రచనలు ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని నింపాయని, ప్రజాకవి కాళోజీ రచనలు, సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని, ముఖ్యంగా యువత కాళోజీ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్ ,సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

