రామగుండం: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నేరుగా స్వీకరించారు.
ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను శ్రద్ధగా విన్న పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి,సంబంధిత స్టేషన్ హౌస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఫిర్యాదుల వివరాలను తెలుసుకుని, చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, బాధితులకు న్యాయం చేయడమే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని,ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రధానంగా సివిల్ స్వభావం కలిగినవని, అలాంటి వివాదాలను సంబంధిత న్యాయస్థానాల ద్వారానే పరిష్కరించుకోవడం శాశ్వతమైన, చట్టబద్ధమైన మార్గమని తెలిపారు.
ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడులు,గొడవలకు పాల్పడరాదని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.ఏవైనా వివాదాలు లేదా సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.

