* రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
* వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి సాగును మరింత విస్తరించవద్దు
* ఆగస్టు 15 నుంచి 1.05 కోట్ల కుటుంబాలకు తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
* గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు… ప్రస్తుతం 16 లక్షలకు పైగా కొత్త కార్డుల మంజూరు
* మండల ప్రజావాణిని ప్రతి వారం తప్పనిసరిగా నిర్వహించి ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలి
* వనమహోత్సవం, చేయూత పెన్షన్లు, యూనిఫాం కుట్టు పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి
* జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పెద్దపల్లి : రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున రైతులను నీటి అవసరం అధికంగా ఉండే వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, యువజన సేవల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ పరిస్థితులు, వ్యవసాయం, మండల ప్రజావాణి, వనమహోత్సవం, రేషన్ కార్డుల పంపిణీ, చేయూత పెన్షన్లు, పాఠశాల యూనిఫాంల కుట్టు పనుల పురోగతిని సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం రానున్న నెలల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటల సాగును విస్తరించకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూసి రైతులు వరి సాగును పెంచే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితి భవిష్యత్తులో రైతులకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నందున ప్రతి రైతుకు స్పష్టమైన సందేశం చేరేలా వ్యవసాయ అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ప్రస్తుతం సాగునీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మరో 15 రోజుల పాటు అన్ని ప్రధాన ప్రాజెక్టుల నీటి మట్టాలను సమీక్షించిన అనంతరం పరిస్థితులకు అనుగుణంగా సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోకి వస్తున్న నీటి ప్రవాహాలను బట్టి అందుబాటులో ఉన్న ప్రతి జల వనరును నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల జారీ జరగలేదని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 16 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిందని చెప్పారు. రాష్ట్రంలోని 1.05 కోట్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించి అర్హులైన ప్రతి కుటుంబానికి సకాలంలో అందేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి జిల్లాలో పంటల వైవిధ్యీకరణ కార్యాచరణ ప్రణాళికను యథావిధిగా అమలు చేయాలని ఆదేశించారు.
ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను రైతులకు ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 99,81,167 ఎకరాల్లో వివిధ పంటల సాగు జరిగిందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఆగస్టు 15 తర్వాత వర్షపాతం మరింత తగ్గే అవకాశమున్నందున ప్రతి జిల్లాలో సాగునీటి సలహా సమావేశాలు నిర్వహించి నీటి లభ్యత ఆధారంగా సాగు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో భవిష్యత్తులో విద్యుత్ సరఫరాపైనా ప్రభావం ఉండే అవకాశమున్నందున నీటి వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, వరి సాగును మరింత పెంచవద్దని స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 35 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, అది మరింత పెరగకుండా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ఆదేశించారు. కంది, పెసర, మినుములు విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచామని, పప్పుధాన్యాల విత్తనాల పంపిణీ కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ వచ్చే నెల నుంచి ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నందున ప్రణాళికలు, పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో వరి సాగులో కనీసం 50 శాతం విస్తీర్ణాన్ని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 15 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్, పప్పుధాన్యాలు, కూరగాయలు, కంది, అలసందలు, పొద్దుతిరుగుడు, చిరుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధుల సంపూర్ణ సహకారం అధికారులకు ఉంటుందని పేర్కొన్నారు. వనమహోత్సవం కింద నిర్దేశించిన మొక్కల నాటే లక్ష్యాలను పూర్తి చేసి, నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
వీబీజీఆర్‌ఏఎంజీ కార్యక్రమంలో భాగంగా ఈ వర్షాకాలంలో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో ఇంకుడు గుంతలను నిర్మించాలని ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి 1.05 కోట్ల తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, కొత్త చేయూత పెన్షన్ల అర్హుల జాబితాను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సిద్ధం చేసి వచ్చే నెల నుంచి పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ అధికారి, పౌర సరఫరాల శాఖ అధికారి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి, నీటిపారుదల శాఖ అధికారులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

