పెద్దపల్లి:జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారమ్ (ఇఎఫ్)ను తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష విజ్ఞప్తి చేశారు.
ప్రజల సౌకర్యార్థం అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ సేవలను వినియోగించుకుని ఎన్యూమరేషన్ ఫారమ్‌లను త్వరితగతిన సమర్పించాలని ఆయన సూచించారు. దీంతో ఇఎఫ్ డిజిటైజేషన్ ప్రక్రియ వేగవంతమై, జిల్లాలో 100 శాతం పురోగతి సాధించేందుకు సహకరించాలని కోరారు.
అలాగే, ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు తమ గ్రామం లేదా పట్టణంలోని మీసేవ కేంద్రాలను సందర్శించి స్వయంగా ఇఎఫ్ సమర్పించుకోవచ్చని తెలిపారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) అందిస్తున్న సేవలను వినియోగించుకుని ఎలాంటి జాప్యం లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ కీలక కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఓటర్స్ పోర్టల్ ద్వారా ఇఎఫ్ సమర్పణ విధానం
voters.eci.gov.in** వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
* మొబైల్ నంబర్ లేదా ఈపీఐసీ నంబర్‌తో లాగిన్/సైన్ అప్ చేయాలి.
* ఓటీపీ నమోదు చేసి లాగిన్ పూర్తి చేయాలి.
* హోమ్‌పేజీలోని **Special Intensive Revision (SIR) – Fill Enumeration Form (EF)** ఎంపికపై క్లిక్ చేయాలి.
* రాష్ట్రాన్ని ఎంపిక చేసి ఈపీఐసీ నంబర్ నమోదు చేసి ఓటరు వివరాలను పొందాలి.
* 2002 ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి.
* 2002 ఓటరు జాబితాలో పేరు లేకుంటే, తల్లిదండ్రులు లేదా అర్హత కలిగిన సమీప బంధువుల వివరాలతో సెర్చ్ చేసి నమోదు చేయాలి.
* వ్యక్తిగత, కుటుంబ, చిరునామా, మొబైల్ నంబర్ తదితర వివరాలను ధృవీకరించి అవసరమైతే సవరించాలి.
* అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
* వివరాలను మరోసారి పరిశీలించి **Submit** చేయాలి.
* సమర్పణ అనంతరం వచ్చే అక్నాలెడ్జ్‌మెంట్/రిఫరెన్స్ నంబర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని లేదా స్క్రీన్‌షాట్ తీసుకుని భద్రపరచుకోవాలి.ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు సమీప మీసేవ కేంద్రం లేదా బూత్ లెవల్ అధికారి (బీఎల్‌వో) సహాయంతో కూడా ఎన్యూమరేషన్ ఫారమ్‌ను సమర్పించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

