Thursday, July 30, 2026

Buy now

ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని పడగొడతారు : కల్వకుంట్ల కవిత

హైదరాబాద్,బంజారాహిల్స్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల జోలికి వస్తే ప్రజలే ఈ ప్రభుత్వాన్ని పడగొడతారని ఆమె హెచ్చరించారు.

విద్యా కమిషన్ నివేదిక పేరుతో రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందని కవిత ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ రక్షణ సేన మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. తాజాగా “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్” పేరుతో ఒక్కో పాఠశాలకు రూ.146 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని విమర్శించారు.

మొత్తం 72 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో సగానికి పైగా పనులను మేఘా, కేఎంవీ సంస్థలకే అప్పగించారని, వారు 5 శాతం అదనపు కోట్ చేయడంతో ప్రభుత్వంపై రూ.600 కోట్లకు పైగా అదనపు భారం పడుతోందని ఆరోపించారు. టెండర్లలో గోల్‌మాల్ జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సింది పోయి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని కవిత విమర్శించారు. బడ్జెట్ పాఠశాలలకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేయకుండా వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. యంగ్ ఇండియా స్కూళ్ల పనులను రెండు సంస్థలకే ఇవ్వడం టెండర్లలో రింగ్ జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

స్కూళ్లు ప్రారంభమై నెల రోజులు గడిచినా ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫాంలు అందలేదని, బ్రేక్‌ఫాస్ట్ హామీ అమలు కాలేదని ఆమె అన్నారు. మధ్యాహ్న భోజనంలో ఇచ్చే గుడ్డుకు ప్రభుత్వం రూ.6 మాత్రమే ఇస్తోందని, మార్కెట్‌లో గుడ్డు ధర రూ.8 ఉండటంతో ఆ మొత్తాన్ని పెంచాలని, వారంలో మూడు రోజులు కాకుండా ఐదు రోజుల పాటు గుడ్డు అందించాలని డిమాండ్ చేశారు.

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో దూర ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేస్తే ముఖ్యంగా ఆడపిల్లలు నష్టపోతారని, తల్లిదండ్రులు వారిని దూర ప్రాంతాలకు పంపేందుకు వెనుకాడతారని కవిత అన్నారు. అందుకే ప్రతి గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలు కొనసాగాలని, గ్రామ సర్పంచ్‌లు ఈ అంశంపై పోరాడాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టత లేకుండానే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్ర చేస్తోందని ఆరోపించిన కవిత.. ప్రభుత్వ విద్యను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను తెలంగాణ రక్షణ సేన ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular