* రూ.2.55 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
* ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహారం, మెరుగైన మౌలిక వసతుల కల్పన
* విద్యారంగం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
* సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య, ఫలితాలు గణనీయంగా పెరుగుతున్నాయి
* బొంపెల్లి–తెనుగుపల్లి మధ్య రూ.50 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం
పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. మండలంలోని పెద్దకల్వల, నిట్టూరు, తుర్కల మద్దికుంట, బొంపల్లి, రాగినేడు, అప్పన్నపేట గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో రూ.2.55 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు.
అనంతరం పెద్దకల్వల గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే బొంపెల్లి గ్రామంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి తెనుగుపల్లి వరకు రూ.50 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడ్డాయని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం పెద్దకల్వల పాఠశాలకు రూ.19 లక్షలు, నిట్టూరుకు రూ.45 లక్షలు, తుర్కల మద్దికుంటకు రూ.48 లక్షలు, బొంపల్లికి రూ.25 లక్షలు, రాగినేడుకు రూ.58 లక్షలు, అప్పన్నపేటకు రూ.60.50 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. పెద్దపల్లి మండలం, పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మొత్తం రూ.5.70 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు విద్యార్థుల సంఖ్య, విద్యా ప్రమాణాలు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా విద్యారంగంలో అగ్రస్థానంలో నిలవడం ఇందుకు నిదర్శనమన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందిస్తున్నామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించి, ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

