– ప్రభుత్వాసుపత్రుల్లో కరువైన రక్షణ
– ఇందిరమ్మ పాలనలో బాలింతలకు భరోసా లేకుండా పోయింది
– మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
– బాన్సువాడ ఘటనపై ప్రభుత్వంపై ఆగ్రహం
– నిమ్స్‌లో బాలింతలకు పరామర్శ
ప్రజానావ, హైదరాబాద్: ఇందిరమ్మ పాలనలో బాలింతలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రిలో చికిత్స వికటించి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలింతలను సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్సువాడ ఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదుగురు బాలింతలు ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. వారిలో ముగ్గురు డయాలసిస్‌పై ఉన్నారని, తెల్ల రక్తకణాలు తగ్గడంతో పాటు కిడ్నీ, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్నారని చెప్పారు. బాలింతల నుంచి పసికందులకు కూడా ఇన్‌ఫెక్షన్ సోకిందని, నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారులు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. బాలింతలు ఇంకా పూర్తిగా కోలుకోలేదని, పసికందులను ఎవరు చూసుకుంటారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఆరుగురు మహిళలకు ఈ నెల 10న ఇన్‌ఫెక్షన్ సోకిందని, నలుగురికి 11వ తేదీన సిజేరియన్ ఆపరేషన్లు జరిగాయని తెలిపారు. ఆపరేషన్ థియేటర్ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఇన్‌ఫెక్షన్ సోకిందని బాధితులు చెబుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కూడా కారణమని ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. కాలం చెల్లిన మందుల వినియోగం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బాధితులు చెబుతున్నారని అన్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు కనీసం బాధితులను పరామర్శించలేదని విమర్శించారు. ఒక బాధిత కుటుంబం నగలు అమ్మి, అప్పులు చేసి వైద్య చికిత్సలు చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పిందన్నారు. ఇంతటి ఘటన జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ హయాంలో ప్రత్యేక శ్రద్ధ
మహిళల ఆరోగ్యంపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందని హరీశ్‌రావు అన్నారు. గర్భిణులకు న్యూట్రీషన్ కిట్లు, బాలింతలకు కేసీఆర్ కిట్లు అందించామని తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించామని, అమ్మ ఒడి వాహనాల ద్వారా బాలింతలను సురక్షితంగా ఇళ్లకు చేర్చామని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గిందని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రుల్లో మహిళలు, బాలింతలకు భరోసా కల్పించే చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.

