– 443 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. నిఫ్టీ 24,239 వద్ద ముగింపు
– హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్‌లపై అమ్మకాల ఒత్తిడి
– అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, పెరిగిన ముడిచమురు ధరల ప్రభావం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ప్రధాన ప్రైవేటు బ్యాంకుల షేర్లలో భారీ అమ్మకాలు, అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్ల పతనం సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది. బీఎస్ఈ సెన్సెక్స్ 442.93 పాయింట్లు (0.57 శాతం) క్షీణించి 77,708.52 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఒక దశలో 783.16 పాయింట్లు పడిపోయి 77,368.29 స్థాయికి చేరింది. ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 95.80 పాయింట్లు (0.39 శాతం) తగ్గి 24,238.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా 5.48 శాతం నష్టపోయింది. త్రైమాసిక ఫలితాల్లో మార్జిన్లపై నెలకొన్న ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు కూడా 5.12 శాతం దిగజారింది. మారుతీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు ట్రెంట్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
ముడిచమురు ధరల ప్రభావం
అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. బ్రెంట్ క్రూడ్ ధర ఒక దశలో బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరుకోగా, అనంతరం స్వల్పంగా తగ్గి 88.06 డాలర్ల వద్ద ట్రేడైంది. ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నప్పటికీ విస్తృత మార్కెట్‌లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 0.56 శాతం, మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 0.39 శాతం పెరిగాయి. రంగాల వారీగా చూస్తే ప్రైవేటు బ్యాంకుల సూచీ 2.15 శాతం నష్టపోయింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ రంగాలు కూడా ఒత్తిడికి లోనయ్యాయి. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీ 2.96 శాతం పెరిగి మెరుగైన పనితీరు కనబరిచింది. యుటిలిటీస్, పవర్, హెల్త్‍కేర్, మెటల్స్ రంగాలు లాభాల్లో ముగిశాయి. మధ్యప్రాచ్య పరిణామాలు, ప్రైవేటు బ్యాంకుల త్రైమాసిక ఫలితాలపై ఉన్న ఆందోళనలు సమీప కాలంలో మార్కెట్లలో ఒడిదుడుకులకు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు

