* రూ.450 కోట్ల రుణానికి ఆమోదం.. తీసుకున్నది రూ.109 కోట్లే: ఎమ్మెల్యే
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నార్తిన్ హోటల్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బ్యాంకు రుణాలు, అప్పుల చెల్లింపుల విషయంలో విపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరోసారి ఖండించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా తనపై చేసిన ఆరోపణలు అసత్యమని, వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సముచితం కాదని అన్నారు.
రూ.450 కోట్ల రుణానికి ఆమోదం లభించినప్పటికీ, తాను కేవలం రూ.109 కోట్ల రుణాన్ని మాత్రమే తీసుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. తీసుకున్న రుణానికి సంబంధించి వడ్డీ, అసలు కలిపి బ్యాంకు రుణాన్ని చెల్లించినట్లు వెల్లడించారు.
రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదిగి తన వ్యాపారాన్ని రూ.వెయ్యి కోట్ల స్థాయికి తీసుకెళ్లినట్లు ప్రేమ్ సాగర్ రావు వివరించారు. వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూడటం అవివేకమని ఆయన విమర్శించారు.
ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, లక్షెట్టీపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, లక్షెట్టీపేట్ మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, లక్షెట్టీపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీతో పాటు జిల్లా నాయకులు, మహిళా నాయకురాలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

