* వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
మంచిర్యాల,జూలై 29:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాల రాళ్లవాగు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా రాళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పాత మంచిర్యాల ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రమాదకర ప్రాంతాలను పూర్తిగా మూసివేసి, అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నామని, మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు సూచిస్తున్న ట్రాఫిక్ మళ్లింపులను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని, వర్షాకాలంలో భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా కోటపల్లి, నీల్వాయి ప్రాంతాల వైపు ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలను మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 30 మంది శిక్షణ పొందిన సిబ్బంది అత్యవసర సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని కమిషనర్ తెలిపారు. గత ఏడాది వరదల సమయంలో గ్రామాలు నీటిలో చిక్కుకున్నప్పుడు బోట్ల సహాయంతో విజయవంతంగా సహాయక చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించేందుకు పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ అందుబాటులో ఉన్నారని చెప్పారు.ఈ పరిశీలనలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

