రామగుండం: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలోని పాత బజారు ప్రాంతంలో ఏర్పడిన పరిస్థితులను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌తో కలిసి గురువారం పరిశీలించారు.
వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప వరద ప్రభావిత ప్రాంతాల్లో సంచరించవద్దని విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ పర్యటనలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

