* రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
* రెడ్ అలర్ట్ నేపథ్యంలో వచ్చే 24 గంటలు అత్యంత కీలకం
* ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి
* చెరువులు, గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలి
* ముంపుకు గురైన కుటుంబాలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని వసతులు కల్పించాలి
* జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ప్రజానావ,బ్యూరో,పెద్దపల్లి : గత 48 గంటలుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, రానున్న 24 గంటల పాటు రెడ్ అలర్ట్ నేపథ్యంలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ లతో కలిసి భారీ వర్షాల పరిస్థితిపై జిల్లా అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని ఒక్క చెరువు కూడా గండి పడకుండా లేదా తెగిపోకుండా సాగునీటి శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా సాగునీటి శాఖ అధికారి ఆధ్వర్యంలో లస్కర్లు, సహాయ ఇంజినీర్లు అందరూ క్షేత్రస్థాయిలోనే ఉండి పూర్తి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్) చెరువులను పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలతో కలిసి నిరంతరం పరిశీలించాలని సూచించారు. చెరువుల్లో గండ్లు, నీటి పొంగిపొర్లడం లేదా ప్రమాదకర పరిస్థితులు కనిపించిన వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించి అత్యవసర నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీట మునిగిన కాజ్‌వేలు, లోతట్టు రహదారులను వెంటనే రాకపోకలకు మూసివేయాలని, అలాంటి ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలు, పోలీసు సిబ్బందిని మోహరించి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వర్షాల వల్ల దెబ్బతిన్న తాగునీటి పైప్‌లైన్లను వెంటనే గుర్తించి అత్యవసర మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్లు వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, పశువుల నష్టం వంటి ఘటనలను వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిహార ప్రతిపాదనలు సిద్ధం చేసి ట్రెజరీకి పంపించి బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రానున్న 24 గంటల పాటు రెడ్ అలర్ట్ కొనసాగనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్‌పర్సన్లు తదితర స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నీట మునిగిన ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించి, అక్కడ ఆహారం, తాగునీరు, వసతి, తదితర అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. అలాగే శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లను వెంటనే గుర్తించి వాటిలో నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్) అధికారులు విద్యుత్ సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించి, దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థలను అత్యవసరంగా పునరుద్ధరించాలని మంత్రి ఆదేశించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు, సరిహద్దు మండలాలు, గ్రామాల్లో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని, చేపల వేట, పశువులను మేపడం లేదా ఇతర ప్రమాదకర కార్యకలాపాల కోసం ఎవరూ నదిలోకి వెళ్లకుండా విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న లేదా రాకపోకలకు అంతరాయం కలిగిన రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమ ప్రధాన కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఏవైనా అత్యవసర సంఘటనలు జరిగిన వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో గంగయ్య, సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

