# హేట్ స్పీచ్‌ను అరికట్టేందుకు సమతుల్య విధానం రూపొందించడమే లక్ష్యం: తెలంగాణ హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ
హైదరాబాద్: భావప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమని, అదే సమయంలో కులం, మతం, ప్రాంతం, భాష వంటి అంశాల ఆధారంగా ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు సామాజిక శాంతి, సామరస్యానికి భంగం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ చైర్మన్ అన్నారు.
తెలంగాణ హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ చైర్మన్‌గా అసెంబ్లీ కమిటీ హాల్‌లో కమిటీ రెండవ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, కోవా లక్ష్మీ, మాణిక్ రావు, అబ్దుల్ బలాల, శాసనసభ కార్యదర్శి తిరుపతి, హోంశాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శితో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు హేట్ స్పీచ్‌ను అరికట్టేందుకు అవసరమైన చట్టపరమైన అంశాలు, చట్టాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై సమగ్రంగా చర్చించారు. హేట్ స్పీచ్ నియంత్రణకు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనలు, వాటి అమలు తీరును అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజల భావప్రకటన హక్కును గౌరవిస్తూనే, ద్వేషాన్ని ప్రోత్సహించే చర్యలను నిరోధించే సమతుల్య విధానాన్ని రూపొందించడమే కమిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ చట్టం సమానంగా వర్తించేలా కమిటీ పనిచేస్తుందని తెలిపారు.
భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం, అదే సమయంలో ద్వేషపూరిత ప్రసంగాల వల్ల సమాజంలో శాంతి, సామరస్యానికి విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకునేలా సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు కమిటీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

