ప్రజనావ,పెద్దపల్లి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా భీమారం పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయన ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి, విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు.
అనంతరం స్టేషన్‌కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించిన సీపీ, ఎస్‌ఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు. స్టేషన్ పరిధిలో తరచుగా నమోదవుతున్న నేరాలు, గ్రామాల పరిస్థితులు, శాంతిభద్రతలు, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో **5ఎస్ విధానం** సమర్థవంతంగా అమలు చేయాలని, స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సీపీ సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, నేరస్తుల ఇళ్లను తరచూ తనిఖీ చేస్తూ వారి కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. స్టేషన్ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తించి, ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు, ఇతర సంస్థలతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు చేపట్టాలని సీపీ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు.

